కని పెంచిన తల్లిదండ్రులను దేవుడితో సమానంగా కొలిచే సంప్రదాయం భారత దేశంలో ఉంది. అందులో తల్లి అంటే చాలా మంది దేవతగా భావిస్తుంటారు. పిల్లలను పెంచి పెద్ద చేయడంలో తన జీవితాన్ని ధారబోస్తుంది అమ్మ. అందుకే తల్లి అంటే అందరికీ ప్రేమ ఎక్కువ. ఏదైనా దెబ్బ తగిలితే అందరి నోటి నుంచి వెంటనే వచ్చే పదం 'అమ్మ'. ఇక పాశ్చాత్య దేశాలలో 18 ఏళ్లు దాటిన పిల్లలు తల్లిదండ్రులను వదిలి వేరుగా జీవిస్తుంటారు. ఈ బిజీ లైఫ్‌లో తల్లికి ఒక రోజు కేటాయించాలనే నిర్ణయంతో అంతర్జాతీయ మదర్స్ డే ఏర్పడింది. ఏటా మే రెండవ ఆదివారాన్ని ప్రపంచ వ్యాప్తంగా 'మదర్స్ డే'గా నిర్వహిస్తుంటారు. ఈ ప్రత్యేక రోజుకు సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది.
ఏసు క్రీస్తు పునరుత్థానానికి సంబంధించి క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటుంటారు. దీనికి ముందు 40 రోజులు లెంట్ డేస్(శ్రమకాలం)గా నిర్వహిస్తారు. ఈ 40 రోజులలో నాలుగవ ఆదివారం 'మదరింగ్ సండే'గా నిర్వహించేవారు. ఇక కాలక్రమంలో 1870 ఏడాదిన అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ మాతృ దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. బోస్టన్‌లో అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న 'మదర్స్ ఫ్రెండ్ షిప్ డే'గా నిర్వహించింది. ఆమె చనిపోయిన తర్వాత మదర్స్ డే కోసం ఆమె కుమార్తె మిస్ జెర్విస్ ఉద్యమం నడిపింది. ఈ క్రమంలో తన తల్లి రెండో వర్థంతి సందర్భంగా 1910లో అమెరికాలో తొలిసారి మదర్స్ డే నిర్వహించింది. 1911 నాటికి యూఎస్‌లోని అన్ని రాష్ట్రాలలోనూ మదర్స్ డే నిర్వహించడం మొదలైంది. 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మదర్స్ డే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మదర్స్ డే రోజున జాతీయంగా సెలవు కూడా ప్రకటించారు. కొంత కాలానికి ప్రపంచ వ్యాప్తంగా మే రెండవ ఆదివారం నాడు ఇంటర్నేషనల్ మదర్స్ డేను అన్ని దేశాల్లో నిర్వహించడం ప్రారంభించారు.