మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి సమస్యలతో చెరుకు తోటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది.
వేసవి కాలంలో, ముఖ్యంగా మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి సమస్యలతో చెరుకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకోవడానికి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నీటి లభ్యత తక్కువగా ఉంటే బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవాలి.
- పిలక దశలో ఉన్న చెరుకు తోటకు తేలికపాటి నేలల్లో 7 రోజులకు ఒకసారి, బరువైన నేలల్లో 10 నుంచి 15 రోజులకొకసారి నీటి తడిని తప్పకుండా అందించాలి. తడికి తడికి మధ్య వ్యవధిని పెంచుతూ, పైరుకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలగచేయాలి.
- నీటి ఎద్దడిని తట్టుకోవడానికి 2.5 శాతం యూరియా + పొటాష్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి.
- నీటి వసతి తక్కువగా ఉన్న చెరుకు తోటల్లో హెక్టారుకు 3 టన్నుల చొప్పున చెరుకు చెత్తను పరచాలి. దీనివల్ల నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటుంది.
- నీటి ఎద్దడి ఉండే ప్రాంతంలో ముచ్చెలు నాటిన తర్వాత చెరుకు చెత్తను బోదెల్లో పరచాలి. దీనివల్ల నేలలో తేమ నిలిచి ఉంటుంది. పీక పురుగు తాకిడిని తట్టుకుంటుంది. చెత్తను మందంగా కప్పకూడదు. అలా చేస్తే తోటల్లో మొలక శాతం తగ్గుతుంది. పురుగులు, తెగుళ్లు సోకిన తోటల నుంచి చెత్తను సేకరించవద్దు.
- వేసవిలో లేత చెరుకు పంటను పీక పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాండం లోపలి భాగాన్ని తినేయడం వల్ల మొవ్వలు ఎండిపోతాయి. మొవ్వ నుంచి చెడువాసన వస్తుంది. దీని నివారణకు చనిపోయిన మొవ్వను ఏరి పారేయాలి. లీటర్ నీటిలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.6 మి.లీ. క్లోరిపైరిఫాస్ 50 ఈసీ కలిపి పిచికారీ చేయాలి.