ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం సహజం. ఈ క్రమంలోనే ఇండోనేషియాలో ఒకపుడు భాగమైనా తూర్పు తైమూరు తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇదిలావుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించి పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, భూకంపం నష్టంపై ఎటువంటి నివేదికలు అందుబాటులోకి రాలేదు. భూకంప కారణంగా హిందూ మహాసముద్రంలో సునామీకి అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే సునామీని సృష్టించే సామర్థ్యం భూ కంపానికి ఉండొచ్చు’’ అని పేర్కొంది. తూర్పు తైమూరు, ఇండోనేషియా మధ్య విడిపోయిన తైమూర్ ద్వీపం తూర్పుకొన నుంచి 51.4 కిలోమీటర్లు (32 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
దీంతో ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలను హిందూ మహాసముద్ర సునామీ హెచ్చరికలు కేంద్రం జారీచేసింది. తూర్పు తైమూర్ రాజధాని దిలీలో భూకంపం సంభవించిందని అయితే ఇది చాలా త్వరగా జరిగిపోయిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘ప్రజలు యధావిధిగా తమ కార్యకలాపాల్లో నిమగ్నపోయారు’ అని జర్నలిస్ట్ చెప్పారు. తూర్పు తైమూర్, ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉన్నాయి. ఆగ్నేయాసియా గుండా పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న ఈ జోన్ తీవ్రమైన భూకంపాలకు కేంద్ర బిందువు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించి పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2004లో సుమత్రా తీరంలో 9.1తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీంతో సునామీ ఏర్పడి ఇండోనేషియాలో దాదాపు 170,000 మంది సహా సమీపం ప్రాంతంలోని 220,000 మంది చనిపోయారు. ఆగ్నేయ ఆసియాలో అతి చిన్న దేశమైన తూర్పు తైమూర్ జనాభా 1.3 మిలియన్లు. ఇండోనేషియా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం ఇటీవలే 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 42 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు.