ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్బీఐ అందరి అంచనాలను మించి వడ్డీ రేట్లను పెంచింది

national |  Suryaa Desk  | Published : Fri, Aug 05, 2022, 12:34 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అందరి అంచనాలనూ మించి రెపో రేటుని పెంచింది. దేశంలోని వివిధ వాణిజ్య బాంకులకు తాను ఇచ్చే లోన్లపై వసూలు చేసే వడ్డీ (రెపో) రేటును 50 బేసిస్‌ పాయింట్లు (బీపీఎస్‌) హైక్‌ చేసింది. దీంతో ఇది 5.40 శాతానికి చేరింది. రెపో రేటుని 35 బీపీఎస్‌ వరకు పెంచుతారని పారిశ్రామిక వర్గాలు భావించగా వాళ్ల ఎస్టిమేషన్‌ని తలకిందులు చేసింది. కొవిడ్‌ అనంతరం ఆర్బీఐ రెపో రేటును పెంచటం ఇది మూడోసారి. మే నెలలో 40 బీపీఎస్‌, జూన్‌లో 50 బీపీఎస్‌ పెంచిన కేంద్ర బ్యాంకు ఇవాళ మరో 50 బీపీఎస్‌ పెంచటం గమనార్హం.


రెపో రేటు పెరగటంతో హౌజింగ్‌, బైక్‌, ఇతర లోన్ల ఈఎంఐలు కూడా మరింత భారం కానున్నాయి. ఆవు వెళ్లి చేలో మేస్తే దూడ గెట్టు మీద మేస్తుందా అన్నట్లు కొన్ని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ కన్నా ముందే తమ వినియోగదారులకు వడ్డీ రేట్లను వడ్డించటం మొదలుపెట్టాయి. మరికొన్ని బ్యాంకులు ఆర్బీఐ ప్రకటన వచ్చిన వెంటనే కొత్త వడ్డీ రేట్లను అమలుచేశాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.


మొన్నటి నుంచి జరుగుతున్న మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌(ఎంపీసీఎం)లో తీసుకున్న పలు నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. మన దేశంలో కరోనా వైరస్‌ 2020 మార్చి నుంచి విజృంభించగా అంతకన్నా ముందే వృద్ధి రేటు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. మొదట్లో 75 బేసిస్‌ పాయింట్లు, తర్వాత 40 చొప్పున కోత పెట్టింది. మూడు నెలల్లోనే ఏకంగా 250 బీపీఎస్‌ తగ్గించటం చెప్పుకోదగ్గ విషయం. ఫలితంగా రికార్డు స్థాయిలో రెపో రేటు 4 శాతానికి దిగొచ్చింది. అనంతరం 11 సార్లు ఎంపీసీఎంలను నిర్వహించినా ఒక్కసారి కూడా రెపో రేటును పెంచలేదు.
కానీ ఈ ఏడాది మే, జూన్‌తోపాటు తాజాగా రెపో రేట్లను పెంచటంతో అది మళ్లీ కొవిడ్‌ పూర్వ స్థాయికి పెరిగింది. రెపో రేటు పెంపునకు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా సమ్మతి తెలిపినట్లు శక్తికాంతదాస్‌ చెప్పారు. రెపో రేటుతోపాటు స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును కూడా 50 బీపీఎస్‌ పెంచటంతో అది 5.15 శాతానికి చేరింది. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటును సైతం 50 బీపీఎస్‌ పెంచటంతో అది కాస్తా 5.65 శాతానికి ఎగబాకింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాను 7.2 శాతంగానే ఉంచారు.


దాన్ని పెంచటం గానీ తగ్గించటం గానీ చేయలేదు. వివిధ కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకోబోయే పరిణామాలు మన ఎకానమీ పైనా నెగెటివ్‌ ఎఫెక్ట్‌ చూపుతాయని ఆర్బీఐ అలర్ట్‌ చేసింది. వచ్చే రోజుల్లో వంట నూనెల రేట్లు ఇంకా తగ్గుతాయంటూ తీపి కబురు చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగానే ఉంచారు. ఎలాంటి సవరణా చేయలేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత ప్రస్తుతం రూ.3.8 లక్షల కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. ఇది ఏప్రిల్‌-మే మధ్య కాలంలో రూ.6.7 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com