ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రివైండ్ 2019 : తెలుగు సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 26, 2019, 11:53 AM

టాలీవుడ్ ఇప్పుడు కొత్త హీరోలతో, కొత్త కొత్త కథలతో ముందుకెళ్తుంది. హీరోల స్టార్ డంతో సంబంధం లేకుండా కొత్త కథలకు బ్రహ్మరధం పట్టడంతో పెద్ద సినిమాలు కొంచెం వెనుకంజ వేశాయనే చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే 2019 స్టార్ హీరోలకు, పెద్ద సినిమాలకు కొంచెం నిరాశే మిగిల్చింది అని చెప్పాలి. జనవరి నుండి ఇవాళ్టి వరకు చూసుకుంటే దాదాపు 140 సినిమాలు విడుదలయ్యాయి. ఒక్కసారి.. 2019 టాలీవుడ్ క్యాలండర్ లోకి వెళ్తే..


జనవరి నెలలో మొత్తం 7 సినిమాలు విడుదల కాగా.. హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన బాలయ్య 'ఎన్టీఆర్ కథానాయకుడు', రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలు డిజాస్టర్ లుగా నిలువగా.. చిన్న హైప్ తో విడుదలయిన 'ఎఫ్ - 2' సినిమా భారీ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరింది. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా వెంకీని, వరుణ్ తేజ్ ని 100కోట్ల సింహాసనం మీద కూర్చోబెట్టింది. అక్కినేని వారసుడు అఖిల్ కి ఈ ఏడాది కూడా ప్లాప్ తోనే సరిపెట్టుకున్నారు.


ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదలయ్యాయి. కాగా... ఒక్క 'యాత్ర' సినిమా మినహాయించి మిగిలిన తొమ్మిది సినిమాలు నిరాశపరిచాయి. ఈ సారి 'ఎన్టీఆర్ మహానాయకుడి'తో హిట్ మీద కన్నేసిన బాలయ్యకు మళ్ళీ నిరాశే ఎదురయింది. ఫిబ్రవరి తెలుగు సినిమాలకు భారీగా నష్టాన్ని మిగిల్చింది.


మార్చి నెలలో 11 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ 11 సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో హిట్ సాధించలేదు. మార్చి నెల సంవత్సరానికే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాకపోవడం విశేషం.


ఏప్రియల్ నెలలో 8 సినిమాలు విడుదలయ్యాయి. 'మజిలీ' లాంటి సూపర్ హిట్ తో మొదలైన ఏప్రియల్ లో అందరి మనసులని దోచుకున్న 'జర్సీ', 'చిత్రలహరి' లాంటి సినిమాలు ఈ సంవత్సరానికే హైలెట్ గా నిలిచాయి.


మే నెలలో 5 సినిమాలు విడుదల కాగా... 'ఫలక్ నామ దాస్' సినిమా అనుకోని రీతిలో విజయం సాధించింది. దాంతో పాటు మహేష్ బాబు 'మహర్షి' కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలు తప్ప ఈ నెలలో మిగతా సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. 'ఫలక్ నామ దాస్' సినిమాతో విశ్వక్ సేన్ మాస్ ఫాలోవింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక మహేష్ 'మహర్షి' సినిమా బాక్సాఫీస్ వద్ద 175 కోట్లను కొల్లగొట్టింది.


జూన్ నెలలో ఏకంగా 13-సినిమాలు విడుదలయ్యాయి. చిన్న సినిమాలుగా ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలయిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'మల్లేశం', 'బ్రోచేవారెవరురా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.


జూలై నెలలో 13 సినిమాలు విడుదలయ్యాయి. కాగా.. 'ఓ బేబీ'..'దొరసాని'..'ఇస్మార్ట్ శంకర్' సినిమాలు విజయాన్ని సాధించగా 'డియర్ కామ్రేడ్' లాంటి సినిమాలు ఫ్లాపులతో సరిపెట్టుకున్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' తో రామ్ మాస్ హీరోగా మారిపోయాడు. రామ్ ఇది వరకూ చాలా మాస్ ప్రయత్నాలు చేశాడు. కానీ టార్గెట్ రీచ్ అవ్వలేదు. కానీ ఈ ఏడాది పూరి తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం పక్కా మాస్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా మాస్ టార్గెట్ ఆడియన్స్ కి బాగానే నచ్చేసింది.


ఆగష్టు నెల ప్లాప్ తో మొదలై.. మరలా ప్లాప్ తోనే ముగిసింది. ఈ నెలలో భారీ అంచనాల మధ్య విడుదలయిన ప్రభాస్ 'సాహో', నాగ్ 'మన్మధుడు -2' సినిమాలు అభిమానులకు నిరాశను మిగిల్చాయి. పాన్ ఇండియా సినిమాగా విడుదలయిన 'సాహో' నష్టాలతో సరిపెట్టుకొని అభిమానుల అంచనాలను అందుకుపోలేకపోయింది. భారీ ప్లాప్ అంటిపెట్టుకున్న ఈ నెలలో 'ఎవరు' లాంటి సస్పెన్స్ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది. సాహో బాక్సాఫీస్ వద్ద 430 కోట్లను కొల్లగొట్టింది.


వరుణ్ తేజ్ కి ఇది హిట్ ఇయర్. ఏకంగా రెండు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. సెప్టెంబర్ నెలలో మొత్తం 8 సినిమాలు విడుదల కాగా.. వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా తప్ప అనుకున్నంత రేంజ్ లో ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా వరుణ్ 'ఎఫ్-2' , 'గద్దలకొండ గణేష్' సినిమాల హిట్లతో ముందున్నాడు.


అక్టోబర్ నెల 'సైరా' లాంటి భారీ అంచనాలు వున్న సినిమాతో మొదలయింది. అభిమానులు పెట్టుకున్న అంచనాలను చిరూ అందుకోలేదనే చెప్పాలి. సైరా బాక్సాఫీస్ వద్ద మొత్తం 250 కోట్లను కొల్లగొట్టింది. ఇక 'చాణక్య' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గోపీచంద్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. మొత్తంగా అక్టోబర్ లో చెప్పుకోదగ్గ విధంగా ఏ సినిమా హిట్ కొట్టలేదనే చెప్పాలి.


నవంబర్ లో ఎక్కువగా 14 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ని రోజులుగానో ఊరిస్తూ వచ్చిన 'అర్జున్ సురవరం' తో పాటు 'జార్జిరెడ్డి' లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక మిగతా సినిమాలు నవంబర్ లో నిరాశగా వెనుదిరిగాయి.


ఇక ఆఖరి డిశంబర్ లో ఇప్పటివరకు మొత్తం 9 సినిమాలు విడుదల కాగా... 'వెంకీమామ' సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వెంకీ కామెడీకి అంటా ఫిదా అయిపోయారనే చెప్పుకోవచ్చు. బాలయ్య 'రూలర్' సినిమా ప్లాప్ తో సరిపెట్టుకుంది.


ఈ సంవత్సరం బాలక్రిష్ణవి ఏకంగా మూడు సినిమాలు విడుదల కాగా.. ఏ ఒక్కటి కూడా అనుకున్నంతలో విజయం సాధించలేదు. మరోవైపు నాగ చైతన్య, వెంకటేష్, వరుణ్ తేజ్ వి రెండేసి సినిమాలు విడుదల కాగా అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa