|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 04:58 PM
ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఆ ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ హైడ్రా చీఫ్ ను నిలదీశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన మంత్రి వివేక్ ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చకుండా, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిందని విమర్శించారు. గాజులరామారంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదు కానీ అదే గాజులరామారంలో పేదల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.