|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 05:16 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సన్నబియ్యం పథకాన్ని ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని, దమ్ముంటే ఆ పథకాన్ని ఆపి చూడాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "సన్నబియ్యం పథకం కాంగ్రెస్‌ది కాదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగం. ఈ పథకంలో కేంద్రం కిలో బియ్యానికి రూ.42 భరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.15 మాత్రమే. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి, పథకాన్ని ఆపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే" అని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడంపై ఇప్పటికే బీజేపీ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.