|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 08:37 PM
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న హైదరాబాద్ ఫోర్త్ సిటీ (భారత్ ఫ్యూచర్ సిటీ) ప్రాజెక్టు పనులు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు, పెట్టుబడిదారులకు చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీ శాఖలోని ఒక ప్రత్యేక విభాగం 'ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ' పేరుతో అత్యాధునిక వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పోర్టల్‌ల తరహాలోనే ఇది ఉండనుంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ తెలంగాణ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో ప్రాథమిక సమాచారం ఉండగా.. కొత్త పోర్టల్‌లో పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం పూర్తిస్థాయి డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్ల క్రయవిక్రయాలు, అనుమతుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్, బేగరికంచ గ్రామాల పరిధిలో ఈ భావి నగరం రూపుదిద్దుకుంటోంది. తొలి దశలో 32 గ్రామాల పరిధిలో 432 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా దీనిని 56 గ్రామాలు 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణానికి పెంచారు. ఇక్కడ కేవలం ఐటీ, ఫార్మా సంస్థలే కాకుండా గేమింగ్ జోన్లు, వినోద కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు కొలువుదీరనున్నాయి. ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2047’ విజయవంతం కావడంతో పెట్టుబడిదారుల నుంచి భారీగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో భూ సరిహద్దుల నిర్ణయం కోసం ప్రత్యేకంగా 20 మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. వీరు ప్రైవేటు, పట్టా, ప్రభుత్వ భూములను గుర్తించి సరిహద్దులు నిర్ణయిస్తారు. మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ శాశ్వత కార్యాలయాన్ని ఫిబ్రవరి నెలాఖరులోపు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు వెబ్‌సైట్‌లో 'ప్రశ్నలు-సమాధానాలు' విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.