|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:16 PM
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ వంటి నగరాల్లో నివసించే వారు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ తిప్పలు తప్పవు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పండుగ ప్రయాణం కాస్త అసహనానికి గురిచేస్తుంది. అయితే.. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ప్రయాణికులకు ఒక శుభవార్త అందుతోంది. ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.
సుమారు 162 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 4,609 కోట్లను వెచ్చిస్తోంది. ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉన్న మార్గాన్ని సంక్రాంతి నాటికి వాహనాల రాకపోకల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకు ప్రయాణ సమయం తగ్గనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుండి విశాఖపట్నం లేదా రాజమండ్రి వెళ్లాలంటే విజయవాడ మీదుగా సుమారు 12 గంటల సమయం పడుతుంది. కానీ ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి పూర్తయితే.. ప్రయాణ దూరం సుమారు 125 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. విజయవాడ ట్రాఫిక్ గుండా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం వల్ల సుమారు 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి నిర్మాణం వల్ల కేవలం ప్రయాణికులకే కాకుండా వాణిజ్య రంగానికి కూడా భారీ ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈ హైవే అందుబాటులోకి వస్తే ..
ఏలూరు జిల్లా పరిధిలోని యర్రంపేట, కన్నాయగూడెం ప్రాంతాల్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం కావడంతో చివరి దశ పనులు ఊపందుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
విశాఖపట్నం పోర్టు నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు విజయవాడ వంటి రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఖమ్మం మీదుగా తెలంగాణకు చేరుకోవచ్చు. ఇది రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తుంది. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలతో పాటు.. ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వారికి రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారందరికీ ఈ రహదారి సరికొత్త, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు.