|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 07:47 AM
తెలంగాణలోని యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉపాధి తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'ఇన్‌స్టామార్ట్', 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' సంయుక్తంగా ఒక ప్రత్యేక అకడమిక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీశ్ మీనన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ భాగస్వామ్యంలో భాగంగా సుమారు 5,000 మందికి పైగా యువతకు క్విక్ కామర్స్ రంగంలో అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధానంగా డార్క్ స్టోర్ ఆపరేషన్లు, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్, సర్వీస్ లెవల్ ఆధారిత డెలివరీ వంటి అంశాల్లో మెళకువలు నేర్పిస్తారు. అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా రిటైల్ లాజిస్టిక్స్ రంగంలో వస్తున్న కొత్త పోకడలపై కూడా అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి 'స్టోర్ మేనేజర్ ట్రెయినీ' వంటి కీలక బాధ్యతల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.