|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:25 PM
ఖమ్మం నగరపాలక సంస్థలో బీఆర్ఎస్‌కు మరోసారి భారీ షాక్ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, ఆయన రాకకు ముందే ఐదుగురు కార్పొరేటర్లు కారు దిగి హస్తం గూటికి చేరారు. ఈ పరిణామం జిల్లాలోని గులాబీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేయగా, కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.60 డివిజన్లు కలిగిన ఖమ్మం కార్పొరేషన్‌లో తాజా వలసలతో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2021 ఎన్నికల్లో కేవలం 10 స్థానాలతో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం, ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సహా ఏకంగా 37 మంది కార్పొరేటర్ల మద్దతుతో తిరుగులేని శక్తిగా ఎదిగింది. గత శాసనసభ ఎన్నికల నుంచి మొదలైన వలసల పర్వం లోక్‌సభ ఎన్నికల సమయంలో మేయర్ పునుకొల్లు నీరజ చేరికతో మరింత వేగవంతమై కార్పొరేషన్ పగ్గాలు కాంగ్రెస్ వశమయ్యేలా చేసింది.హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కార్పొరేటర్లు గోళ్ల చంద్రకళ, డోన్‌వాన్ సరస్వతి, దాదె అమృతమ్మ, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.