|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:54 PM
కుటుంబం అంటే సమస్యలు సహజమని, చిన్న చిన్న మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు సర్వసాధారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలా లేకపోతే అది కుటుంబమే కాదన్నారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే సాయంత్రం వంట విషయంలో ఒకరు వంకాయ, మరొకరు బెండకాయ అని వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని, కుటుంబంలో చిన్నపాటి పంచాయితీలు కూడా ఉంటాయని, అయితే వాటిని ఇంటికే పరిమితం చేసి ఆ తర్వాత కలిసిపోవాలని ఆయన సూచించారు.జనగామ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ పోటీకి ఒకరికే అవకాశం ఉంటుందని అన్నారు. టిక్కెట్ వచ్చే వరకు మాత్రమే పార్టీలో అసంతృప్తులు ఉండాలని, ఒకరికి బీఫామ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మనం ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని, బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలో అసంతప్తులు ఉంటే కాంగ్రెస్, బీజేపీలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆయన అన్నారు.బీఫామ్ ఒక్కరికే వస్తుందని, పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ ఇస్తుందని కేటీఆర్ అన్నారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కళ్లు మూసుకుని కారు గుర్తుపై ఎవరున్నా వారినే కేసీఆర్‌లా భావించి ఓటు వేయాలని ఆయన కోరారు. కాగా, కవిత బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.