|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 05:45 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జగిత్యాల నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే అంగట్లో సరుకు కాదని, అనేక దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కార్యకర్తలు పార్టీ జెండాను మోశారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. ఎన్నడూ కాంగ్రెస్ కండువా కప్పుకోని వారు, పార్టీ సిద్ధాంతాలు తెలియని వారు ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సహించరానిదని మండిపడ్డారు. పార్టీ అంతర్గత విషయాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తానే టికెట్లు ఇస్తానని ఎమ్మెల్యే అనడంపై జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చే అధికారం ఎవరికి ఉందో పార్టీ అధిష్ఠానానికి తెలుసని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే అసలు కథ తేలుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు ఇవ్వు, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను కదా అని కాంగ్రెస్ పార్టీని తొక్కుతానంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవడివిరా మా పార్టీని తొక్కడానికి?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జీవన్ రెడ్డి వర్గానికి మింగుడుపడటం లేదు. నియోజకవర్గంలో పట్టు కోల్పోతామనే ఆందోళన పాత కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరోవైపు, ఎమ్మెల్యే తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆధిపత్య పోరు చివరకు పార్టీ హైకమాండ్ దాకా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదరకపోతే పార్టీకి నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.