|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:26 PM
హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' పనులు వేగవంతం అయ్యాయి. కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును వచ్చే 30 నెలల్లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో సీఎం స్వయంగా వివరాలు పంచుకుంటూ దిశానిర్దేశం చేశారు.మొదట్లో ఇక్కడ కేవలం స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీలను మాత్రమే ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు దీని పరిధిని మరింత విస్తరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు 70 శాతం సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 11 టౌన్‌షిప్‌లుగా విభజించి, పర్యావరణానికి హాని కలగని రీతిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో 300 ఎకరాల్లో ఏఐ సిటీ, 200 ఎకరాల్లో హెల్త్ సిటీ, 3 వేల ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్, 500 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.