|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 09:26 PM
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో సేవల పని వేళలను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న మెట్రో టైమింగ్స్‌లో కీలక మార్పులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటి గంటల వరకు మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల కారణంగా నగరవ్యాప్తంగా ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయని, ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రాత్రి వరకు మెట్రో సేవలను కొనసాగించాలని నిర్ణయించినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.సాధారణ రోజుల్లో మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. అయితే డిసెంబర్ 31న ప్రత్యేకంగా అర్థరాత్రి 1 గంటల వరకు మెట్రోలు తిరగనున్నాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీలకు, ఈవెంట్లకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది ఉపశమనంగా మారనుంది. సాధారణంగా డిసెంబర్ 31 రాత్రి నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మెట్రో ద్వారా గమ్యస్థానానికి వేగంగా చేరుకోవచ్చు.అయితే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లలో, స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, మెట్రో సిబ్బంది నిఘా పెంచనున్న నేపథ్యంలో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో అధికారులు సూచించారు.ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు మెట్రో సేవలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ చర్యతో ప్రజలకు సౌకర్యం కలగడంతో పాటు మెట్రోకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక పండుగలు, వేడుకలు, పెద్ద ఈవెంట్ల సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెట్రో ఎప్పుడూ ముందుండి పని చేస్తుందని వారు స్పష్టం చేశారు.