|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:30 PM
మీడియా ప్రతినిధుల ముందే ఎదురుదాడికి దిగిన ఐ బొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించిన రవి, “నా పేరు ఐ బొమ్మ రవి కాదు. ఐ బొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారు?” అంటూ మీడియాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.నిన్న పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం రవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కోరగా, కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు.మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాకుండా, వారికే రవి తిరిగి ప్రశ్నలు సంధించాడు. “నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని మీరు ఎలా చెబుతున్నారు? మీ దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా? పోలీసులు చెబితే అదే నిజమా? మీడియా కోర్టు కాదు, నేను కోర్టులోనే మాట్లాడతాను” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అలాగే విదేశాలకు పారిపోయారనే ఆరోపణలను కూడా ఖండిస్తూ.. తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని స్పష్టం చేశాడు.