|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 08:14 PM
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలవాయి గ్రామంలో ఒక వింతైన.. ఆలోచించదగ్గ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. డబ్బులు, మద్యం, చీరలు పంచడం మన దగ్గర ఎన్నికల సంస్కృతిలో భాగమైపోయింది. అయితే ఇక్కడ ఓడిపోయిన ఒక అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు గ్రామస్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఉప్పలవాయి గ్రామానికి చెందిన బాబవ్వ అనే మహిళ రెండో వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా పోటీ చేశారు. ఎన్నికల్లో గెలవాలనే ఆశతో ఆమె ఓటర్లకు చీరలు, మద్యం సీసాలు, కూల్ డ్రింక్ బాటిళ్లు పంపిణీ చేశారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె ఓడిపోయారు. ప్రత్యర్థి అభ్యర్థి విజయం సాధించడంతో బాబవ్వ ఆ ఓటమిని తట్టుకోలేకపోయారు.
తాను ఇచ్చినవన్నీ తీసుకుని తనకు ఓటు వేయలేదనే కోపంతో గత వారం రోజులుగా వార్డులోని ప్రజలను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. గ్రామస్తులు ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినకపోగా. మరింత ఘాటుగా బూతులు తిట్టారు. దీంతో విసిగిపోయిన ఓటర్లు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇచ్చిన చీరలు, మద్యం బాటిళ్లు, కూల్ డ్రింక్ సీసాలన్నింటినీ మూటగట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందుకు వచ్చి నిరసన తెలిపారు. ‘మేము ఏమీ అడగలేదు, మీరే ఇచ్చారు. ఇప్పుడు ఓడిపోతే మమ్మల్ని తిడతారా..?’ అంటూ ఆ వస్తువులన్నీ అక్కడ పారేసి వెళ్ళిపోయారు.
ఎన్నికల సమయంలో ఓట్లను కొనుగోలు చేయడం అనే అలవాటు ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన అద్దం పడుతోంది. ఈ విషయంలో కొన్ని ముఖ్యంశాలను మనం గమనించాలి. ప్రస్తుత కాలంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు, మద్యం ప్రాధాన్యత పెరిగిపోయింది. అభ్యర్థులు గెలవడానికి వేలల్లో, లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
కానీ ఓటర్లు మాత్రం అన్నీ తీసుకుని తమకు నచ్చిన వారికే ఓటు వేస్తున్నారు. ఇది ఒక రకంగా ఓటరు చైతన్యాన్ని సూచిస్తున్నా... మరోవైపు అభ్యర్థుల్లో ఫ్రస్టేషన్ పెంచుతోంది. బాబవ్వ ఉదంతం దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. చిన్న గ్రామాల్లో ఇలాంటి గొడవలు రావడం వల్ల కుటుంబాల మధ్య, కులాల మధ్య గొడవలు పెరుగుతాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పాత కక్షలు కొనసాగడం వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది. గెలిచినా, ఓడినా అభ్యర్థులు హుందాతనాన్ని ప్రదర్శించాలి.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లకు మద్యం, చీరలు లేదా డబ్బులు పంచడం పెద్ద నేరం. ఈ ఘటనలో బాబవ్వ పంపిణీ చేసినట్లు గ్రామస్తులే స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి.. అధికారులు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంటుంది. వస్తువులను వెనక్కి ఇచ్చేయడం ద్వారా ఉప్పలవాయి ప్రజలు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ‘మీరు ఇచ్చినవి మాకు అవసరం లేదు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి’ అని వారు నిరూపించారు. బహుశా రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఓడిపోయిన తర్వాత ఓటర్లను వేధించడం అనేది అనాగరిక చర్య. పోలీసులు రంగంలోకి దిగి మహిళలను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.