|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 05:34 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై, మంత్రుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను గాలికి వదిలేసి, ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అధికార పార్టీ నేతల ఆగడాలతో సామాన్యులకు రక్షణ కరువైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కుమారుడు అమాయకుల భూములను కబ్జా చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఒక నిజాయతీ గల పోలీస్ అధికారి సాహకించి మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేస్తే, చట్టాన్ని రక్షించినందుకు ఆయనను అభినందించాల్సింది పోయి.. రాత్రికి రాత్రే బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని, నిజాయతీగా పనిచేసే అధికారులను భయభ్రాంతులకు గురిచేసే చర్య అని ఆయన విమర్శించారు.
మంత్రివర్గంలోని మరో మంత్రి వ్యవహారశైలిని కూడా కేటీఆర్ ఈ సమావేశంలో ఎండగట్టారు. సదరు మంత్రి పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సిన మంత్రులే.. ఇలా ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలను భయపెట్టి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా కొందరు మంత్రులు మాఫియాలా పని చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "పేరులో గాంధీ ఉందని, కానీ ఆయన చేసేవన్నీ గాడ్సే పనులే" అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇలా రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి అరాచకాలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, న్యాయ పోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ పిలుపునిచ్చారు.