|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 05:32 PM
హైదరాబాద్: ఫోర్త్ సిటీ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేవనెత్తిన సూటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సమాధానం దాటవేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా నిలదీశారు. నిన్న జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని, సందేహాలకు సమాధానం ఇవ్వాలని కోరితే.. పలాయనవాదం చిత్తగిస్తూ అసలు విషయాలను పక్కనబెట్టి అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు పలికారు. కేసీఆర్ అడిగిన లాజికల్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకనే రేవంత్ రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా అవకాశవాదంతోనే సాగిందని, చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చిన చరిత్ర ఆయనదని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత పార్టీలోని సీనియర్ నేతలను, సహచరులను తొక్కుకుంటూ పదవులు అనుభవిస్తున్న రేవంత్‌కు.. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. రేపు ఏ పార్టీలో ఉంటారో, ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని, అలాంటి వ్యక్తి ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, నమ్ముకున్న వాళ్ళను మోసం చేయడం రేవంత్ నైజమని ఆయన దుయ్యబట్టారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అనేకమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసించిన విషయాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌దేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా పాలనను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్ చాట్ పేరుతో మాజీ మంత్రులపై, ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు.
ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అభివృద్ధి ముసుగులో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, తమ అనుయాయులకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం, డొంకతిరుగుడు మాటలు మాట్లాడటం మానేసి, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.