|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:45 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందని... పార్టీ బలహీనమయిందని గ్రహించే కేసీఆర్ ఫామ్ హౌస్ ను వదిలి ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫరెండం అని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై కేసీఆర్, కేటీఆర్ చేసిన ఆరోపణలు తప్పు అంటూ ప్రజలు తీర్పును వెలువరించారని చెప్పారు. కేసీఆర్ బయటకు వచ్చింది ప్రాజెక్టుల కోసం కాదని... పార్టీని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్... వచ్చీ రాగానే తోలు తీస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తోలు మాత్రమే మిగిలిందని, కండలు కరిగిపోయాయని అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేయడం తమ ప్రభుత్వ సమర్థత అని చెప్పారు.