|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:20 PM
ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వం వహించి, ప్రపంచ దేశాల దౌత్యవేత్తలు, ఐరాస అధికారులతో కలిసి ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాభారత యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధ్యాన యోగాన్ని బోధించిన విషయాన్ని గుర్తుచేశారు. "నేటి ప్రపంచం కూడా ఓ యుద్ధభూమికి తక్కువేమీ కాదు. రకరకాల సంఘర్షణలతో నిండిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతత కోసం మన అంతరంగంలోకి మనం ప్రయాణించడం ఎంతో అవసరం" అని ఆయన పిలుపునిచ్చారు.ఉక్రెయిన్‌లో వేలాది మంది సైనికులు తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు, ధ్యానం ద్వారానే వారు శాంతిని పొందారని శ్రీశ్రీ రవిశంకర్ ఉదాహరణగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.