|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:23 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట విలేజ్‌లో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. సర్వే నంబరు 186, 191తో పాటు 334లలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని.. కాపాడాలని బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. కబ్జాలతో ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురి అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలంటూ హైడ్రాను కోరారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబరు 334లో ఇప్పటికే 4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలు జరిగి శాశ్వత నివాసాలు కూడా వచ్చినట్టు నిర్ధారించుకుంది. నివాసాల జోలికి వెళ్లకుండా.. అక్కడ మిగిలి ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. 13 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.