|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:49 AM
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ బి. శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కొత్త సిట్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్, డీసీపీలు రితిరాజ్, కె. నారాయణ రెడ్డి వంటి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి దర్యాప్తు అధికారిగా కొనసాగుతారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న సిట్ ముందు లొంగిపోయిన వారం రోజులకే ఈ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.