|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:19 PM
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఈ పరీక్షల్లో భాగంగా.. మార్చి 3వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను ఒక రోజు ముందుకు జరుపుతూ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3న హోలీ పండగ జరుపుకోనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ రోజును అధికారిక సెలవుగా ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీని మార్చారు.
రాష్ట్రంలో ఇంటర్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముఖ్యంగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మార్చి 3న జరగాల్సిన మ్యాథమెటిక్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను ఇప్పుడు మార్చి 4వ తేదీన నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం మార్చి 2న గణితం 1ఏ, బోటనీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 25న.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో రాత పరీక్షలు మొదలవుతాయి. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 26న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది.
ఫిబ్రవరి 27, 28 తేదీల్లో.. వరుసగా మొదటి , రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 2 వ తేదీన.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 4వ తేదీన సవరించిన తేదీ ప్రకారం సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ఉంటాయి. మార్చి 5 , 6వ తేదీల్లో.. ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ 1బీ/2బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉంటాయి. మార్చి 9 , 10 తేదీల్లో.. భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), ఎకనమిక్స్ పరీక్షలు వరుసగా రెండు సంవత్సరాల విద్యార్థులకు జరుగుతాయి. మార్చి 12 , 13వ తేదీల్లో రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), కామర్స్ పరీక్షలతో ప్రధాన సబ్జెక్టులు ముగుస్తాయి.
ప్రాక్టికల్ పరీక్షల్లో మార్పు లేదు..
రాత పరీక్షల కంటే ముందే నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు మారిన తేదీలను గమనించి.. గందరగోళానికి గురికాకుండా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని అధికారులు సూచించారు. సవరించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.