|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:45 AM
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను ఆయన ప్రశంసించారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐ గవర్నర్‌కు వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా, అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌ల నిషేధ (బడ్స్) చట్టాన్ని రాష్ట్రంలో నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని ఆర్బీఐ గవర్నర్ కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యూఎల్ఐ), ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ చేపడుతున్న ప్రచారం గురించి కూడా ఆయన వివరించారు. రాష్ట్రం మరిన్ని సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.