|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 12:43 PM
ప్రతి సంవత్సరం చేసే పనే.. కానీ ఈ వర్షాకాలంలో చేసిన పని ఎంతో సంతృప్తినిచ్చింది. భారీవర్షాలు కురిసాయి.. ఒక్క రోజులోనే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడడం సర్వ సాధారణంగా మారింది. కాని ఎక్కడా వరదలు లేవు. కాలనీలు, బస్తీలు నీట మునగలేదు. ఒక వేళ వరద వచ్చినా.. వెంటనే క్లియర్ అయ్యంది. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఏడాది చూశాం.. అధికారుల పర్యవేక్షణ, సహకారం, సమస్య తలెత్తితే పరిష్కరించిన తీరు.. మా పని మరింత సులభం చేసింది. దీంతో క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించాయి`` అని వర్షాకాలంలో హైడ్రాతో కలసి పని చేసిన మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లతో పాటు స్టాటిక్ టీమ్‌ల కాంట్రాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మెట్ కాంట్రాక్టర్లను అభినందించారు. కల్వర్టులు, క్యాచ్‌పిట్లలో పూడికను తీయడమే ఒప్పందం అయినా.. హైడ్రాతో కలసి నాలాలను కూడా క్లియర్ చేశారని.. దీంతో వరద సాఫీగా సాగిందన్నారు.
మెట్, స్టాటిక్ టీమ్‌ల కాంట్రాక్టర్ల ఎంపిక నుంచి 150 రోజుల పాటు పని చేసినన్ని రోజులు హైడ్రా తమకు ఎంతో సహకారం అందించిందని కాంట్రాక్టర్లు అన్నారు. 30 సర్కిళ్లకు వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఎందరికో ఉపాధి దొరికింది. ఒక్కో టీమ్‌లో ఐదుగురు చొప్పున ఒక్కో డివిజన్‌లో 3 బృందాలు పని చేశాయి. ఇలా 150 టీమ్‌లు.. 2250 మంది పని చేశారు. వీరికి తోడు 1200ల మంది స్టాటిక్ (వరద నిలిచే ప్రాంతంలో పని చేసే సిబ్బంది)టీమ్ సభ్యులు తోడయ్యారు. మొదటి వర్షంతోనే సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతోంది.. అనేది హైడ్రా అంచనా వేసింది. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో సూచించింది. ఆ దిశగా మెట్ బృందాలను హైడ్రా వినియోగించుకుంది. భారీ వర్షం పడుతున్నప్పుడు హైడ్రా కమిషనర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్వర్టులు, క్యాచ్‌పిట్లలో పేరుకుపోయిన పూడికతో పాటు.. నాలాలను క్లియర్ చేశాం.. ఈ పనులను కూడా హైడ్రా కమిషనర్ పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ బృందాలకు హైడ్రా సిబ్బంది వెన్నంటే ఉండి సహకారం అందించిన తీరుతో మరిన్ని మంచి ఫలితాలు సాధించామని మెట్ కాంట్రాక్టర్లు పేర్కొన్నారు.
హైడ్రా అధికారులు, డీఆర్ ఎఫ్ బృందాలు, ఎస్ ఎఫ్‌వోలు ఇలా అన్ని స్థాయిల్లో సహకారం అందింది. మొదటి సారి కొత్త సంస్థతో పని చేస్తున్నాం ఎలా ఉంటుందో అనుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. పని చేశాం. ఎక్కడా కష్టమనిపించలేదని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. వాస్తవానికి కల్వర్టులు, క్యాచ్‌పిట్లలో పేరుకుపోయిన పూడిక తీయడమే హైడ్రా విధి అయినా.. వరద సాఫీగా సాగడానికి ఇదొక్కటే సరిపోదు.. నాలాల్లో కూడా పూడికను తొలగించాల్సి ఉందని హైడ్రా గుర్తించింది. ఆ మేరకు అమీర్‌పేటలో మొత్తం పూడికపోయిన 6 భూగర్భ పైపులను క్లియర్ చేశాం. దీంతో ఈ ఏడాది వర్షం పడితే అక్కడ వరద ముంచెత్తలేదు. కృష్ణానగర్‌లో పూడిక తీసిన పనిని పెద్దయెత్తున చేయడంతో రహదారులను వరద ముంచెత్తకుండా ముందుకు సాగింది. యెల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్ నివాసితులు హైడ్రాకు అభినందనలు తెలిపారు. అందులో మేము భాగస్వామ్యం అయిన సంతృప్తి మిగిలింది. ఇదే పరిస్థితి టోలీచౌక్ వద్ద, పాతబస్తీలో, ఎల్‌బీనగర్ ఇలా నగర వ్యాప్తంగా హైడ్రాతో కలసి సేవలందించడం కొత్త అనుభూతికి లోనయ్యామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు.