|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 08:08 PM
నేను.. నా వాళ్లతో పాటు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ల గురించి ఆలోచించినప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అన్నారు. "పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని" ప్రముఖ కవి సి.నా.రె. గారు తన గజల్స్‌లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది మానవ జీవితం యొక్క పరమార్థాన్ని, ఇతరుల కోసం జీవించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే గొప్ప వాక్యమని దీనిని అందరూ ఒంట పట్టించుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనతో పాటు చుట్టుపక్కల వారిని కూడా సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో `యువ ఆపద మిత్ర` పథకం వాలంటీర్లకు హైడ్రా ఆధ్వర్యంలో ఫతుల్‌గూడలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణను హైడ్రా కమిషనర్ ప్రారంభించి ప్రసంగించారు. పరుల కోసం పాటుపడే ఆలోచనతో ఈ శిక్షణకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. మన రెండు చేతుల్లో ఒకటి పరులకు చేయూతనందించడానికి ఉపయోగపడాలన్నారు. మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం వరకే పరిమితమవ్వకుండా ఇతరులకు కూడా చేయూతనందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తోటివారిని కాపాడడం ఎలా అనేది ఈ శిక్షణలో నేర్పుతారని.. మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులపై అవగాహన ఉండాలన్నారు. అప్పుడే ప్రమాద సమయంలో తోటివారిని కాపాడగలరన్నారు. వారం రోజుల శిక్షణలో.. అన్ని మెలుకువలు నేర్చుకుని.. వాటిని మరింతమందికి మీరు తెలియజేయాలని సూచంచారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాల గురించి విద్యార్థల సందేహాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నివృత్తి చేయడమే కాకుండా.. వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నారు. చెరువులను పునరుద్ధరించడం, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను, పార్కులను పరిరక్షించడంలో హైడ్రా కృషిని విద్యార్థులు అభినందించారు. హైడ్రా అడ్మిన్ ఎస్‌పి శ్రీ ఆర్. సుదర్శన్ గారు, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య గారు, ఎన్‌డీఆర్ ఎఫ్ డిప్యూటీ క మాండెంట్ శ్రీ దామోదర్ సింగ్, మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గంటా రాజేష్ గారు, హైడ్రా ఆర్ ఎఫ్‌వో శ్రీ జయప్రకాశ్ గారు, డీఎప్‌వోలు శ్రీ యజ్ఞ నారాయణ గారు, శ్రీ గౌతమ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని యువ ఆపద మిత్ర వాలంటీర్లనుద్దేశించి పలు సూచనలు చేశారు. వారం రోజుల శిక్షణ గురించి హైడ్రా ఏడీఆర్ ఎఫ్‌వో శ్రీ డి. మోహనరావు గారు వివరించారు. హైడ్రా కమిషనర్ గారి సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలను కూడా భాగం చేసినట్టు చెప్పారు.