|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:17 PM
కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో సొంత కొడుకునే హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసు మిస్టరీని ఎలా ఛేదించారు? అనే విషయాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు.ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన అంజయ్య (36) 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అంజయ్య 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే, ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి తండ్రి లచ్చయ్యతో తన భార్య సాన్నిహిత్యంగా ఉండటం గమనించిన అంజయ్య ఇద్దరినీ మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ విషయాన్ని బంధువులకు కూడా చెప్పుకుని బాధను వ్యక్తం చేశాడు.తమ అక్రమ సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని భావించిన లచ్చయ్య, కోడలితో కలిసి కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఆ క్రమంలో మూడు నెలల క్రితం మంత్రగాడి వద్ద మందు పెట్టి చంపాలని అనుకున్నారు. అయితే దీనివల్ల అతను అస్వస్థతకు గురైతే సేవ చేయాల్సి వస్తుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.నెల రోజుల క్రితం కొలిపాక రవిని లచ్చయ్య కలిసి కుమారుడిని హత్య చేయడానికి రూ.3 లక్షలకు కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా రూ.1.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. అడ్వాన్స్ తీసుకున్న రవి తనకు తెలిసిన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహ్మద్ అబ్రార్‌తో కలిసి అంజయ్య హత్యకు పథకం వేశారు. ఈ పథకం అమలు చేసేందుకు ముందుగా వారు అంజయ్యతో రోజూ మద్యం సేవిస్తూ స్నేహం పెంచుకున్నారు. ఈనెల 2న అతడిని గ్రామ శివారులోని కాలువ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు.ఆ తర్వాత అంజయ్య కనిపించడం లేదని భార్య, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న కాలువలో అంజయ్య మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు నమ్మించేందుకు ప్రయత్నించినా, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు ఇది హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. హత్య చేసిన వారు సుపారీ డబ్బుల కోసం లచ్చయ్య ఇంటికి రాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా, నిందితులు నేరాన్ని అంగీకరించారు. దీంతో లచ్చయ్య, అతని కోడలితో పాటు కోటేశ్వర్, అబ్రార్, రవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.