|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 09:27 PM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వైద్యరంగంలోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. రోగుల కంటి చూపుతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల గుట్టును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం రట్టు చేసింది. శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు నరేశ్‌కుమార్, రవికుమార్, శ్రీకాంత్‌వర్మల నేతృత్వంలోని బృందం మిర్యాలగూడలోని పలు కంటి ఆస్పత్రుల్లో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏకంగా 8 ఆస్పత్రుల్లో అర్హత లేని వ్యక్తులే వైద్యులుగా చలామణి అవుతున్నట్లు తేలింది. ఈ ఆస్పత్రులన్నీ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి నిపుణులైన కంటి వైద్యుల పేర్లతో అనుమతులు పొంది, క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం టెక్నీషియన్లతో వైద్యం చేయిస్తున్నట్లు కౌన్సిల్ సభ్యులు గుర్తించారు.
అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. కంటి పరీక్షలు చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఈ నకిలీ వైద్యులు ఆపరేషన్లు కూడా చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆప్తమాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లుగా ఉండాల్సిన వారు ఏకంగా మందులు రాస్తూ, శస్త్రచికిత్సలకు సిద్ధపడటం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని మెడికల్ కౌన్సిల్ మండిపడింది. అనుమతులు ఇచ్చిన అసలైన వైద్యులు హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రాక్టీస్ చేస్తూ, ఇక్కడ తమ పేర్లను కేవలం బోర్డులకే పరిమితం చేశారని తేలింది.
ఎస్వీ కంటి వైద్యశాల, షాలిని కంటి ఆస్పత్రుల్లో దగా మరీ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎం.భరత్ భూషణ్, కె.వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు కేవలం ఎంబీబీఎస్ చదివి, 'ఎంఎస్ ఆప్తమాలజీ' చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తనిఖీల విషయం తెలియగానే 'ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్' నిర్వాహకుడు మునీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నకిలీ వైద్యులు, వారికి సహకరిస్తున్న టెక్నీషియన్లు నగేశ్, వాల్కె శ్రీను, నాగరాజు, శివకోటేశ్వరావు, వెంకటేశ్, వికాస్ కుమార్‌లతో పాటు ఆర్ఎంపీ కోటేశ్వరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది.
తమ రిజిస్ట్రేషన్ నంబర్లను నకిలీ ఆస్పత్రులకు అద్దెకు ఇచ్చినట్లు భావిస్తున్న అసలైన కంటి వైద్య నిపుణులు శ్రీకుమార్, ప్రభు చైతన్య, బషీర్, అమర్‌లకు మెడికల్ కౌన్సిల్ షోకాజు నోటీసులు జారీ చేసింది. అనర్హులకు వైద్యం చేసే అవకాశం కల్పించినందుకు వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు కంటి వైద్యం కోసం వెళ్లేటప్పుడు సదరు వైద్యుడి అర్హత పత్రాలను సరిచూసుకోవాలని కౌన్సిల్ సూచించింది. లేదంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.