|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 10:24 PM
హైదరాబాద్‌లో నకిలీ ఈ-చలాన్ లింక్‌పై క్లిక్ చేసిన ఒక వ్యక్తి దాదాపు రూ.6 లక్షలు పోగొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్‌ల లింకులను పంపించి దోపిడీకి పాల్పడుతున్నారు.నిన్న ఇలాంటి లింక్‌పై క్లిక్ చేసిన వ్యక్తి దాదాపు రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడని సజ్జనార్ వెల్లడించారు. ఈ నకిలీ వెబ్‌సైట్ కూడా ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లాగే ఉంటుందని తెలిపారు. పోర్టల్ అలాగే ఉండటంతో బాధితుడు రూ.500 ట్రాఫిక్ ఫైన్ చెల్లించడానికి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు అతని క్రెడిట్ కార్డు నుంచి అంతర్జాతీయ లావాదేవీల ద్వారా డబ్బులు కాజేశారు.ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు. ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే లింకుల ద్వారా ఎప్పుడూ ఫైన్‌లు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.