|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:48 AM
నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు తెలంగాణ గడ్డపై ప్రజల కోసం ఎక్కుపెట్టిన బాణాన్ని అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన పంథా ఇకపై ప్రజల పక్షమేనని, పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆమె తేల్చి చెప్పారు. బుధవారం భువనగిరిలో 'జనంబాట' కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వస్తున్న విమర్శలపై కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వంలో నేను ఎప్పుడూ కీలక పాత్రలో లేను. కుట్రపూరితంగా నన్ను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేశారు. అయితే, ఆ సమయంలో పార్టీలో ఉన్నాను కాబట్టి, ప్రభుత్వ తప్పులకు నేను కూడా బాధ్యురాలినే. ఆ పాపంలో నాకూ భాగముంది. అందుకే ప్రజలకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను అని ఆమె పేర్కొన్నారు.తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను కవిత ఈ సందర్భంగా బయటపెట్టారు. తిరిగి బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తి అస్సలు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మధ్యలో జరిగే ఎలాంటి ఉప ఎన్నికల్లోనూ, ఇతర పోటీల్లోనూ తాను పాల్గొనబోనని చెప్పారు. నేరుగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఎలాంటి కారణం చెప్పకుండానే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కారణం లేకుండా సస్పెండ్ చేయడం బాధ కలిగించింది. కానీ నా ఆత్మగౌరవం ముఖ్యం. దానిపై రాజీపడను. అందుకే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి 'జనంబాట' పట్టాను. జాగృతి అనేది కేవలం పార్టీ విభేదాల వల్ల పుట్టింది కాదు.. 19 ఏళ్ల కిందటే తెలంగాణ భాష, సంస్కృతి కోసం ఏర్పడిన సంస్థ అని గుర్తుచేశారు.