|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:35 PM
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలలో కొన్నిటిని వైకుంఠ ఏకాదశి నుంచి, మిగతా వాటిని ఫిబ్రవరి నెల నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6.15 నుంచి 6.45 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. భక్తులు స్వామివారికి తోమాల సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది.ఇప్పటి వరకు ఉన్న విధానానికి భిన్నంగా తులాభారం సేవను సరికొత్తగా రూపొందించారు. ఈ సేవలో అవసరమైన నాణేలు, బెల్లం వంటి వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందుబాటులో ఉంచనున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తులాభారం నిర్వహించుకునే అవకాశం కలగనుంది.వైకుంఠ ఏకాదశి తర్వాత ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను ప్రారంభించనున్నారు. ఈ సేవకు టికెట్ ధర రూ.500గా నిర్ణయించగా, ఇందులో పాల్గొన్న భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నారు. ఇక ఇప్పటివరకు రథసప్తమి రోజుకే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7.00 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతుల కోసం ఈ సేవ టికెట్ ధరను రూ.1,000గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక శాలువా, కనుమను ప్రసాదంగా అందజేస్తారు.