|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 06:35 PM
కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ బయటకు వస్తే కొంతమంది ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 72 ఏళ్ల నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం బాధాకరమని అన్నారు.ఒకసారి కాలు విరిగినందుకు సంతోషిస్తారు మరోసారి, మరణించాలని శాపనార్థాలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఒక భాష మాత్రమే వచ్చని, తనకు మూడు భాషలు వచ్చని, తాను తలుచుకుంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడగలనని అన్నారు.అయితే, తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం కారణంగా తాను విమర్శించదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా అప్పుడే తిరుగుబాటు మొదలైందని అన్నారు.మహబూబాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓటమి పాలైన వారికి, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికార పార్టీకి ఓటు వేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు భావిస్తారని, కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాలు సాధించారని ఆయన కొనియాడారు.