|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 08:03 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. రేపటి నుంచి జరగనున్న ఈ సమావేశాలకు తాను హాజరవుతున్నట్లు పార్టీ నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుందో గమనించి, దానికి అనుగుణంగా దీటుగా స్పందించాలని సూచించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ లోపల, బయట బలమైన పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేస్థాయిలో బదులిచ్చారు. ఈ మాటల యుద్ధం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఇవి అత్యంత ఆసక్తికరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు, ఆరోపణలతో సభ దద్దరిల్లనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.