|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 01:49 PM
ప్రేమ, వివాహేతర సంబంధం, ఆపై అసభ్యకర వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్.. చివరకు ఓ యువకుడి ప్రాణం తీశాయి. జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేస్తున్నాడనే కోపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి ఒక యువకుడిని దారుణంగా హతమార్చారు.పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ (32) హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఒక యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె అక్కతో కూడా మహేందర్ సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం రావడంతో మహేందర్ అసూయతో రగిలిపోయాడు. తన దగ్గర ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను కాబోయే పెళ్లికొడుకు తరఫు వారికి చూపి ఆ సంబంధాన్ని చెడగొట్టాడు.నిరంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న మహేందర్‌ను వదిలించుకోవాలని అక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్‌తో శుక్రవారం రాత్రి అతడికి ఫోన్ చేసి పిలిపించారు. రాత్రి 10 గంటల సమయంలో వారి మధ్య మాటమాట పెరగడంతో ముందే సిద్ధం చేసుకున్న కారంపొడిని మహేందర్ కళ్లలో చల్లారు. అతడు తేరుకునేలోపే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిందితుల బంధువులు కూడా పాలుపంచుకున్నారు.తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మహేందర్‌ను గమనించిన స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.