|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 09:23 PM
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ (Old City), దక్షిణ ప్రాంతం వైపు ప్రయాణించాలంటే ప్రయాణికులకు నరకం కనపడుతోంది. అయితే ఈ మర్గంలో ప్రయాణించే వారికి త్వరలోనే ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలగనుంది. నల్గొండ ‘ఎక్స్’ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు చేపట్టిన భారీ డెవలప్‌మెంట్ కారిడార్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఈ కొత్త వంతెనను (ఫ్లైఓవర్) వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మంగళవారం ఈ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు 2,530 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ ప్రధాన వంతెన కోసం ప్రభుత్వం 620 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. పనులు వేగంగా పూర్తి చేసి. ఏప్రిల్ కల్లా వాహనాల రాకపోకలకు సిద్ధం చేయాలని ఆయన ఇంజనీర్లను ఆదేశించారు.
ముఖ్యంగా సైదాబాద్ నుంచి ధోబీఘాట్ జంక్షన్ మధ్య పనులు చాలా కీలకం. అక్కడ పనులకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు అనుమతులు త్వరగా తీసుకోవాలని కమిషనర్ సూచించారు. అలాగే.. వంతెన కింద సర్వీస్ రోడ్ల కోసం అవసరమైన స్థల సేకరణను కూడా వేగవంతం చేయాలని అధికారులను కోరారు. దీనివల్ల వంతెన పైనే కాకుండా.. కింద కూడా వాహనాలు సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుంది.
ఈ కారిడార్ పూర్తయితే చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ , కంచన్‌బాగ్ ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి ఆగాల్సి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే సిగ్నల్ అవసరం లేకుండానే నేరుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. పాతబస్తీ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుంది.