|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:23 PM
హైదరాబాద్ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లు, భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ హైవే, మేడ్చల్, తూంకుంట, శామీర్‌పేట, గండిపేట, మోకిల, పటాన్‌చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ నమోదైంది. దీంతో ఉదయాన్నే రోడ్లెక్కిన వాహనదారులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు. ఫలితంగా శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై కూడా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.