|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 01:49 PM
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా మరో 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాకినాడ, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు.ప్రధానంగా కాకినాడ టౌన్-వికారాబాద్ (07186, 07460), వికారాబాద్-కాకినాడ టౌన్ (07185, 07187) మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి. అలాగే వికారాబాద్-పార్వతీపురం (07461), పార్వతీపురం-వికారాబాద్ (07462), పార్వతీపురం-కాకినాడ టౌన్ (07463), సికింద్రాబాద్-పార్వతీపురం (07464, 07465) మధ్య కూడా సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని, ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ తెలిపింది.మరోవైపు విజయవాడ మీదుగా కూడా పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం-చర్లపల్లి (08511) స్పెషల్ రైలు జనవరి 10, 12, 17, 19 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక అనకాపల్లి-వికారాబాద్ ప్రత్యేక రైలు (07416) జనవరి 18న రాత్రి 9.45కు బయలుదేరనుంది. పండుగకు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.