|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:00 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ్యుల పట్ల సీరియస్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 'నీళ్లు-నిజాలు'పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరిగారు.ప్రభుత్వం ఒక కీలక అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తుంటే ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. ప్రజలు సమావేశాలను గమనిస్తుంటారని, కాబట్టి ఎమ్మెల్యేలు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని ఆయన అన్నారు.ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభలో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలందరినీ సభలోకి పిలిపించాలని కాంగ్రెస్ విప్‌లను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.