|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 08:41 PM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎప్పుడు ఎలా జరుగుతాయో కానీ.. పోలీసులకు మాత్రం రకరకాల విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన వారు పోలీసుల నుండి తప్పించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొందరు తమ పలుకుబడిని ఉపయోగిస్తే.. మరికొందరు రోడ్డుపై పడుకుని ఏడుస్తూ నానా హంగామా చేస్తుంటారు. అయితే.. తాజాగా పాతబస్తీలో జరిగిన ఒక సంఘటన మాత్రం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. తన ఆటోను సీజ్ చేసినందుకు ఏకంగా పాముతో పోలీసులను బెదిరించిన ఒక డ్రైవర్ ఉదంతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఒక డ్రైవర్‌ను పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. అందులో రీడింగ్ ఏకంగా 150 పాయింట్లు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. నిబంధనల ప్రకారం ఆటోను సీజ్ చేసి, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. తన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారన్న కోపంతో ఆ డ్రైవర్ ఊహించని పని చేశాడు.
ఆటోలో తన సామగ్రి ఉందని.. అది తీసుకుంటానని చెప్పి వాహనం దగ్గరకు వెళ్లిన ఆ డ్రైవర్.. అకస్మాత్తుగా లోపలి నుండి ఒక పామును బయటకు తీశాడు. ఆ పామును చేతికి చుట్టుకుని.. తన ఆటోను వదిలేయకపోతే పామును వారిపైకి వదులుతానంటూ పోలీసులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడి పక్కకు తప్పుకున్నారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ఆ డ్రైవర్ పాముతో సహా అక్కడి నుండి పరారయ్యాడు.
హైదరాబాద్ పోలీసులు ఇలాంటి వింత పరిస్థితులు ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో తనిఖీలు చేస్తున్న సమయంలో కొందరు తాగుబోతులు ఏకంగా బ్రీత్ అనలైజర్ మిషన్లను పట్టుకుని పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు తమ బంధువులు పెద్ద పదవుల్లో ఉన్నారని బెదిరింపులకు దిగడం సర్వసాధారణం అయిపోయింది. ఇంటికి వెళ్తే భార్య కొడుతుందని, తల్లిదండ్రులు తిడతారని పోలీసుల కాళ్లపై పడి బోరున ఏడ్చే విద్యావంతులను కూడా మనం చూస్తూనే ఉంటాం.
మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను భయపెట్టడం లేదా బెదిరించడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఘటనలో పరారైన ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని.. ఇలాంటి విపరీత చేష్టలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.