|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:01 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026కు ముహూర్తం ఖరారైంది. అశేష జనవాహిని ఎదురుచూస్తున్న ఈ వనదేవతల పండుగ జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన సమ్మక్క-సారలమ్మల దర్శనానికి ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. మహా జాతరకు ముందుగా.. జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
జాతరలో ప్రధాన ఘట్టాలు..
జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెకు ఆగమనం.
జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెకు చేరుకోవడం. జాతరలో అత్యంత కీలక ఘట్టం.
జనవరి 30న భక్తుల మొక్కుల సమర్పణ. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని 'నిలువెత్తు బంగారం' (బెల్లం) సమర్పించుకుంటారు.
జనవరి 31: సాయంత్రం 4 గంటలకు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
మేడారంలో ముందస్తు కోలాహలం..
జాతర సమీపిస్తుండటంతో మేడారం ఇప్పటికే భక్తుల రద్దీతో మినీ జాతరను తలపిస్తోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టి తమ భక్తిని చాటుకున్నారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం అంబులెన్స్‌లు, నిరంతర విద్యుత్ సరఫరా, భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు పార్కింగ్ స్థలాలను విస్తరించారు. వనదేవతల ఆశీస్సుల కోసం తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు ఈసారి జాతర ఒక మధుర స్మృతిగా మిగిలిపోయేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.