|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:17 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న కొన్ని రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) హెచ్చరించింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 6న తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత ప్రభావం చూపనుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.నేడు (7న) కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిల్లో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతర్గత జిల్లాల్లో పొడి వాతావరణంతో పాటు ఉదయం పూట మంచు కురిసే వీలుంది.జనవరి 8న వర్షాల ఉద్ధృతి పెరగనుంది. మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.జనవరి 10న కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాజధాని చెన్నైతో పాటు కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని అంచనా.వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి 10 వరకు తమిళనాడు తీరం, మన్నార్ గల్ఫ్, కొమొరిన్ ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.