|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 07:31 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, మరియు బిజెపి పౌర ఎన్నికల్లో జెండా పాతడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయం మున్సిపల్ వార్ చుట్టూ తిరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో ఆయన భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన మహబూబ్‌నగర్ జిల్లా నుండి ప్రారంభం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది.
ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, స్థానిక సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎత్తిచూపుతూ ఒక ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందిస్తోంది. గులాబీ దళం క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేస్తూ, స్థానిక సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరోవైపు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న తన బలాన్ని నిరూపించుకునేందుకు బిజెపి సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్ట్రాటజీలను అమలు చేస్తూ, కమలం జెండాను మున్సిపాలిటీలపై ఎగురవేయాలని భావిస్తోంది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ, ఈసారి నగరాలు మరియు పట్టణాల్లో గరిష్ట స్థానాలను కైవసం చేసుకునేందుకు అగ్రనాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది.