|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 07:58 PM
సిద్దిపేట జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లి లాంటి అత్తను కిరాతకంగా చంపిన అల్లుడు.. ఏమీ తెలియనట్లు నాటకమాడినా చివరికి.. ఈ నేరం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిమ్మారెడ్డిపల్లికి చెందిన రాములమ్మ (55) అనే వృద్ధురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాములమ్మ భర్త మరణించిన తర్వాత.. ఆమె ఒంటరిగా ఉంటూ తనకు ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకు సమానంగా పంచుతానని ప్రకటించింది.
అయితే ఆ రెండున్నర ఎకరాల భూమిని మొత్తం తానే దక్కించుకోవాలని భావించిన చిన్నల్లుడు జీవన్ రెడ్డి.. అడ్డుగా ఉన్న అత్తను తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం రాములమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన జీవన్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు టవల్‌తో ఆమె గొంతు బిగించారు. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఇది దొంగతనం వల్ల జరిగిన హత్యగా నమ్మించడానికి రాములమ్మ చెవి కమ్మలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకున్న జీవన్ రెడ్డి.. రాములమ్మ మరణవార్త తెలిసినట్లుగా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. శవంపై పడి భోరున ఏడుస్తూ ఎవరికీ అనుమానం రాకుండా హైడ్రామా సృష్టించాడు. అయితే.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. జీవన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి అత్త ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత బయటికి రావడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది.
నిందితుడు జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో జీవన్ రెడ్డి స్నేహితుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.