|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 07:54 PM
తెలంగాణ రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న భారీ ఇందిరమ్మ ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.
మార్చి 31వ తేదీ నాటికి 2,160 ఇళ్లతో కూడిన మోడల్ కాలనీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు తావులేకుండా అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.
మార్చి 31 నాటికి మోడల్ కాలనీ సిద్ధం: మంత్రి పొంగులేటి
హుజూర్‌నగర్ సమీపంలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్లను దేశానికే ఆదర్శంగా నిలిచే మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని.. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను నిర్వీర్యం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2012లో తాను మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో నిలిచిపోయిన పనులను ఇప్పుడు తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కాలనీలో కేవలం ఇళ్లే కాకుండా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం మెరిట్ ప్రాతిపదికన, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.