|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 07:50 PM
సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఒక గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తూనే.. మరోవైపు టికెట్ ధరల పెంపుతో సామాన్యులకు షాక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి 10, 12, 13 తేదీల్లో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు.. 18, 19వ తేదీల్లో తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ఇందుకోసం ఏకంగా 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ముఖ్య కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి వంటి హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా అందుబాటులోకి తీసుకురానున్న ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
టికెట్ ధరల పెంపు
ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ ఛార్జీల భారం మోపింది. ప్రభుత్వ జీవో ప్రకారం.. ఈ స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై సాధారణ ధర కంటే 1.5 రెట్లు (ఒకటిన్నర రెట్లు) అదనపు బాదుడు ఉంటుంది. అయితే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం పాత ధరలే వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం.. అన్ని బస్టాండ్ల వద్ద తాగునీరు, నీడ కోసం పండల్స్, కుర్చీలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ సీట్లను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాలు, సహాయం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.