|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 08:02 PM
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కేవలం అధికార పక్షమే కాకుండా.. విపక్ష నేతలకు కూడా నోటీసులు అందడంతో ఈ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లకు కూడా సిటి నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్.. తాజాగా ముగ్గురు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. కొండల్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను జనవరి 8వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. ఆయనతో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన బాధితుడిగా కొండల్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సిట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ (కల్వకుర్తి), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)లకు కూడా సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ఆ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై వీరిద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.