|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:27 PM
బీజేపీ నాయకులకు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. కుటుంబంలో పిల్లల సంఖ్య గురించిన అంశంపై ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీకు నచ్చిన విధంగా పిల్లలను కనండి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? అని ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ముందుగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నవనీత్ కౌర్, పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి, కొందరు ఎక్కువ మంది పిల్లలను కంటూ దేశాన్ని పాకిస్థాన్‌లా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలంటే హిందువులు కూడా తప్పనిసరిగా ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నలుగురు భార్యలు, ఎక్కువ మంది పిల్లలు అంటూ బహిరంగంగా చెప్పుకునేవారు ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని గుర్తు చేస్తూ, గతంలో ఇదే నిబంధన తెలంగాణలో కూడా ఉండేదని, ప్రస్తుతం అది రద్దయిందని అన్నారు. తనకు ఆరుగురు పిల్లలున్నారని, మీరు కూడా నలుగురిని కనండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అని ఆయన వ్యాఖ్యానించారు.