|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:13 PM
నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని, తాము ‘ముల్లుకర్ర’తో కాదు ‘బల్లెం’తో పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేవలేదని ఆయన ధ్వజమెత్తారు. అనేక ప్రెస్ మీట్లు పెట్టి హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.తమ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో సమావేశం ఏర్పాటు చేసిందని హరీశ్ రావు తెలిపారు. "మేము వద్దని ఎంతగా వారించినా రేవంత్ రెడ్డి ఢిల్లీ సమావేశానికి వెళ్లారు. బనకచర్ల అంశం ఎజెండాలో లేదని మొదట బుకాయించారు. కానీ, మేము ఎజెండాను బయటపెట్టి వాస్తవాలను బట్టబయలు చేశాం. ఆ తర్వాత ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బనకచర్లపై చర్చ జరిగిందని, కమిటీ వేశారని చెప్పడంతో రేవంత్ రెడ్డి అబద్ధం బట్టబయలైంది" అని హరీశ్ వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వాటాను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు.