|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:23 PM
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు గ్రామీణ పేదల జీవితాలను మళ్లీ అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల గ్రామాల్లో పని దొరకక పేదలు మళ్లీ పట్టణాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిరుపేద గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్–గ్రామీణ (వీబీ–జీరామ్‌జీ)’ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శుక్రవారం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.